స్వైన్ ఫ్లూ వైరస్ ఎలా సోకుతుంది.. దాని లక్షణాలేంటి? ఏం చేయాలి...?
వైద్య రంగానికి ఒక సవాల్ విసురుతున్న ప్రాణాంతక వైరస్
స్వైన్ ఫ్లూ. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ అనేక మంది ఈ వ్యాధి బారినపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అలాగే, కనీసం రోజుకు ఒకరు లేదా ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. దీంతో చాలామంది ఏ కాస్త జ్వరం, జలుబు వచ్చినా అవి స్వైన్ ఫ్లూ లక్షణాలేమోనని
తీవ్రంగా ఆందోళన చెందుతూ, ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఆయాస పడటం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, జ్వరం అనేవి సాధారణ స్వైన్ ఫ్లూ లక్షణాలు. వీటితోపాటు కొంతమందికి ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.. లాంటి
లక్షణాలు కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు
లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా భావించి అవసరమైన వ్యాధి
నిర్ధారణ పరీక్షలు చేయించి, తగిన వైద్యాన్ని అందించాల్సి ఉంటుంది.
ఫ్లూ సీజన్‌లో జ్వరం రావటం, మందులు వాడినా, వాడకపోయినా ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోవటం సహజమే. చిన్నపిల్లల
విషయంలో... జ్వరం తగ్గిపోయిన వెంటనే పిల్లలను పాఠశాలలకు పంపకుండా ఒక
రోజంతా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చేయాలి.
చిన్నారులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పడు తప్పకుండా టిష్యూ పేపర్లను అడ్డు పెట్టుకోవాలని తల్లిదండ్రులు తెలియజెప్పాలి. అలాగే ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లను
ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడవేయకుండా.. వెంటనే వాటిని చెత్తబుట్టలో పారవేయమని
చెప్పాలి. అంతేగాకుండా, పిల్లలు తుమ్మిన ప్రతిసారీ వారి చేతులను శుభ్రం చేయడం మంచిది.
ఇక చివరిగా.. చిన్నారులకు ముందుగానే సీజనల్ ఫ్లూ నివారణా వ్యాక్సిన్లను వేయించటం ఉత్తమం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కూడా. అలాగే స్వైన్ ఫ్లూ
నివారణా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఎలా వాడాలంటే.. మొత్తంమీద రెండు
డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుంది. మొదటి డోసు తర్వాత మూడు వారాల వ్యవధితో మరో డోసు ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ దాడిని ఎదుర్కొనేందుకు శరీరం పూర్తిగా సన్నద్ధం కావాలంటే మరో రెండు వారాల సమయం పడుతుంది. కాబట్టి.. పైన
పేర్కొన్న అంశాలను గుర్తుపెట్టుకుని తగువిధంగా చర్యలు తీసుకోవాలి.